బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం తర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ (Salman Khan) కాంబోలో ఈ మూవీ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈద్ కానుకగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే విడుదలైన ప్రతీ చోట దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు బాక్సఫీస్ వద్ద కేవలం రూ.26 కోట్లు కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ లాంటి సీనియర్ హీరోకి తొలిరోజు ఈ కలెక్షన్స్ అంటే చాలా తక్కువనే చెప్పాలి. అంతకుముందు ఈ సినిమా విడుదలకి ముందు భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. రిలీజ్ ముందు రోజే సికిందర్ మూవీ ప్రింట్ కొన్ని వెబ్ సైట్లలో కనిపించింది.
నిజానికి మొదటి నుంచి ‘సికందర్’కు (Sikindar) అంతగా హైప్ క్రియేట్ కాలేదు. దానికి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. ఇటీవలి కాలంలో సల్మాన్ ఖాన్ సినిమాకు ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం ఇదే తొలిసారి. సల్మాన్ ఖాన్ గత సినిమాలు బజరంగీ భాయీ జాన్, కిక్, దబాంగ్, టైగర్ జిందా హై, సుల్తాన్, భరత్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఏక్ థా టైగర్, టైగర్ -3 చిత్రాలకు ఇంతకంటే సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి. సికిందర్ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.

