‘సికందర్’ కలెక్షన్స్‌.. ఫస్ట్‌ డే కంటే రెండో రోజే ఎక్కువ!

by | Apr 1, 2025 | సినిమా

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం త‌ర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రావడంతో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈద్ కానుకగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే విడుదలైన ప్రతీ చోట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు బాక్సఫీస్ వద్ద కేవలం రూ.30 కోట్లు కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. రెండో రోజు ఈద్ పండగ సెలవు దినం కావడంతో రూ. 33.36 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. నిజం చెప్పాలంటే ఇది మంచి హోల్డ్ అనుకోవాలి. మొత్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో కలిపి రూ. 63.42 కోట్ల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ‘సికందర్’ మూవీ బాక్సఫీస్ వద్ద రూ. 95.75 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ లాంగ్ థియేట్రికల్ రన్ లో కలెక్షన్స్ పుంజుకుంటాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న సల్మాన్ ఖాన్ కు ‘సికందర్’ (Sikindar) మూవీ మంచి కమ్ బ్యాక్ ఇస్తుందనుకొంటే.. ఈ సినిమా బాక్సఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరచడం అభిమానుల్ని కలవరపెడుతోంది. వాస్తవానికి సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోకి ఈ కలెక్షన్స్ చాలా తక్కువనే చెప్పాలి. అయితే విడుదలకు ముందు నుంచి ‘సికందర్’కు అంతగా హైప్ క్రియేట్ కాలేదు. దానికి తగ్గట్టుగానే సినిమా ఓపెనింగ్స్ కూడా నిరాశపరిచాయి. వీటన్నిటితో పాటు, సికందర్ విడుదలకు కొన్ని గంటల ముందు ఆన్‌లైన్‌లో లీక్ కావడం సినిమా కష్టాలను మరింత పెంచింది. ఇక సికిందర్ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.