ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి ; సినిమా విడుదల తేదీ ఖరారు

by | Feb 18, 2025 | సినిమా

బాలీవుడ్ యువ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ఛావా. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా గురించి స్టార్ డైరెక్టర్ సందీప్ సింగ్ అదిరిపోయే న్యూస్ చెప్పారు. కన్నడ స్టార్ హీరో కాంతర మూవీ ఫేమ్ రిషబ్‌ శెట్టి టైటిల్ పాత్రలో ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆధారంగా చేసుకొని సినిమా రూపొందించనున్నట్లు ప్రకటించారు. రిషబ్‌ శెట్టి ఇప్పటికే ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమాకు ‘ది ప్రైడ్‌ ఆఫ్‌ భారత్‌ : ఛత్రపతి శివాజీ మహారాజ్‌’. టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తనతో పాటు పని చేసే బృందాన్ని పరిచయం చేశారు.

ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్ర పోషించనున్న రిషబ్‌ శెట్టి ఫస్ట్‌ లుక్‌ను ఈ ఏడాది మే నెలలో జరగనున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు ప్రీతమ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉండనుండగా.. ప్రసూన్‌ జోషి లిరిసిస్ట్‌గా పనిచేయనున్నాడు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ, మలయాళం, బెంగాలి బాషల్లో రూపొందనున్న ఈ సినిమాను
2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.