‘కాంతార’తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి ‘జై హనుమాన్’ (Jai Hanuman) చిత్రంలో ఆంజనేయస్వామి పాత్రలో అలరించనున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే.. దీనికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ చిత్రాన్ని ప్రకటించారు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఇందులో ప్రధాన పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది. దీనికి సంబంధించి రిషబ్ (Rishab Shetty) లుక్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా విజయనగర సామ్రాజ్య పుణ్యక్షేత్రం, కర్ణాటకలోని హనుమంతుడి జన్మస్థలంగా భావించే హంపిలోని అంజనాద్రి బెట్ట వేదికగా ‘జై హనుమాన్’ సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు నటుడు రిషభ్‌శెట్టి, చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఇక ‘జై హనుమాన్’ సినిమా పూర్తిగా ఆంజనేయ స్వామి చుట్టే తిరిగే కథగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెంటిమెంట్‌గా అంజనాద్రి బెట్టలో (Anjanadri Betta) సినిమా చిత్రీకరణను ప్రారంభించారు మేకర్స్. కాగా, పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. ఈ సినిమా తొలి భాగాన్ని మించేలా ‘అంజనాద్రి 2.0’ పేరుతో సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. రామాయణంతో ముడిపడిన ఈ మైథలాజికల్ భారీ యాక్షన్ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో తెలుగు హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం చిత్రబృందం రానాను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో రానా దగ్గుబాటి (Daggubati Rana) కూడా మరో మాట లేకుండా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

