భర్త మహాశయులకు విజ్ఞప్తి : రవితేజ ఖాతాలో హిట్ పడిందా.?

by | Jan 13, 2026 | సినిమా రివ్యూ

రేటింగ్: 2.25/5

విడుదల తేది: 13–01–2026
నటీనటులు: రవితేజ, డింపుల్‌ హయతి, ఆషికా రంగనాథ్‌, సత్య, వెన్నెల కిశోర్‌, సునీల్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: ప్రసాద్ మురెళ్ళ
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ: ఎస్ఎల్‌వి సినిమా
నిర్మాత: చెరుకూరి సుధాకర్‌
స్క్రీన్ ప్లే, మాటలు: కిషోర్‌ తిరుమల
దర్శకత్వం: కిషోర్‌ తిరుమల

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. యంగ్ బ్యూటీస్ డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. గత కొంత కాలంగా హీరో రవితేజ సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌కు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రూపంలో అదిరిపోయే సంక్రాంతి ట్రీట్ తీసుకొచ్చారు. ఈ మూవీ ట్రైలర్ టీజర్ లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ కనిపించడం, పండగ సీజన్ లో రిలీజవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచింది? రవితేజ -కిషోర్ తిరుమల అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ ఫార్ములా వర్కౌట్ అయిందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ:

ఒకవైపు భార్య మరోవైపు, ప్రేమికురాలు వీరిద్దరి మధ్య నలిగిపోయే ఓ సాధారణ వ్యక్తి కథే ఈ సినిమా. అయితే ఈ కథ చుట్టూ వినోదాన్ని మేళవించి జనరంజకంగా మలిచాడు దర్శకుడు కిషోర్ తిరుమల. కథ విషయానికొస్తే.. రామ్ సత్య నారాయణ (రవితేజ) ఒక వైన్ యార్డ్ కు అధిపతిగా ఉంటాడు. తాను కొత్తగా తయారుచేసిన ‘అనార్కలి’ బ్రాండ్ ను స్పెయిన్‌లోని ఓ కంపెనీకి సప్లై చేసేందుకు అక్కడకు వెళ్తాడు. ఈ క్రమంలోనే అనుకోకుండా ఆ కంపెనీ ఎండీ మానస శెట్టి(ఆషికా రంగనాథ్‌)తో ప్రేమలో పడతాడు. కానీ అంతకుముందే రామ్‌కు బాలమణి (డింపుల్ హయతి)తో వివాహం జరిగి ఉంటుంది. అయితే స్పెయిన్ లో మానసకు దగ్గరైన విషయం తన భార్య బాలామణి(డింపుల్‌ హయతి)కి తెలియకుండా రామ్ జాగ్రత్త పడతాడు. ఈ క్రమంలోనే తన వ్యాపారానికి సంబంధించిన పనిపై ఇండియాలో కొన్ని రోజుల పాటు ఉండేందుకు స్పెయిన్ నుండి మానస వస్తుంది. ఆమె ఇండియాకు వచ్చాక రామ్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అటు భార్య, ఇటు ప్రియురాలు మధ్య ఎలా నలిగిపోయాడు? చివరకు ఈ ముక్కోణపు ప్రేమకథ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

ఇందులో రామసత్యనారాయణ పాత్రలో రవితేజ అభినయం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే తనదైన ఎనర్జీ, యాక్షన్‌, కామెడీ, ఎమోషన్స్‌తో ఆడియన్స్‌ని అలరించారు రవితేజ. హీరోయిన్లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌యాతి గ్లామరస్ గా కనిపించారు. తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. బెల్లం పాత్రలో సత్య, రవితేజ పీఏగా వెన్నెల కిషోర్ ఆయన బావగా సునీల్ కడుపుబ్బా నవ్వించారు. మిగతా నటీనటులంతా తమదైన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక దర్శకుడు కిషోర్ తిరుమల ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోతున్న హీరో అందులోంచి బయటపడే క్రమంలో కావాల్సినంత కామెడీ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా కథ బాగానే ఉన్నా.. కథనం కొన్ని చోట్ల చాలా రెగ్యులర్ గా సాగిందనే చెప్పొచ్చు. సినిమా ప్రథమార్దం అంతా సాంగ్స్ అండ్ ఫన్ తో సాగిపోతే.. ద్వితీయార్థంలో కథ కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యమైన క్లైమాక్స్‌ సీన్‌ని కూడా సాదాసీదాగా ముగించేశారనే భావన కలుగుతుంది. ఇక సాంకేతికంగా సినిమా బావుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్:
రవితేజ నటన
కామెడీ
ఫస్టాఫ్

మైనస్‌ పాయింట్స్‌:
కొత్తదనం లేని కథనం
పతాక సన్నివేశాలు