మెగా వార‌సుల బారసాల.. ఏం పేర్లు పెట్టారంటే?

by | Feb 13, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) -ఉపాసన కొణిదెల (Upasana) దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కావడంతో మెగా అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జనవరి 31న ఉపాసన ఒక మగ బిడ్డకు, ఒక ఆడ బిడ్డకు జన్మనివ్వగా ఈ శుభవార్త తెలిసిన వెంటనే అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. చిరంజీవి (Chiranjeevi) ఎప్పటినుంచో మనవడిని చూడాలని కోరుకుంటుండగా, ఈసారి ఒక బాబు మాత్రమే కాకుండా మరో పాప కూడా పుట్టడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపైంది. తాజాగా మెగా వారసుల నామకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ క్రమంలోనే మొదటి కూతురికి ‘క్లీంకార’ (Kleenkara) అని నామకరణం చేసిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లను పెట్టారు. కుమారుడికి శివరామ్‌ అని నామకరణం చేయగా.. కూతురికి అన్వీరా దేవి అని పేరు పెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రామ్‌చరణ్‌ (Ram Charan) మాట్లాడుతూ.. మన హిందూ సంప్రదాయంలో పిల్లలకు పేర్లు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. నా కొడుకు పేరు శివరామ్‌ అని పెట్టాం. శివుడు, రాముడి పేర్లు కలిసివచ్చేలా నామకరణం చేశాం.. అలాగే నా తండ్రి అసలు పేరు శివ శంకర వరప్రసాద్‌ కూడా ఇందులో కలిసి వస్తుంది. ఇక నా కూతురి పేరు అన్వీరా దేవి అని నామకరణం చేశాం.. ఇందులో ‘అన్’ అంటే అపరిమితమైన ‘వీరా’ అంటే ధైర్యం, ‘దేవి’ అనేది కావాలని పెట్టాం అని వెల్లడించారు. కాగా, ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రామ్‌చరణ్ (Ram Charan) , బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ (Peddi) సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో, వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్‌ఇండియా ప్రాజెక్ట్‌లో కన్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండగా.. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు సంగీతం అందించ‌బోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక పెద్ది చిత్రాన్ని 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.