గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం మెగా (Ram Charan) అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మార్చి 27 గురువారం నాడు హీరో రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
మార్చి 27న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ ను కూడా షేర్ చేశారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ చిత్రీకరణ ఇంకా చాలా వరకు పూర్తవకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

