అల్లు శిరీష్ (Allu Sirish) – నయనిక (Nayanika) ల వివాహం మార్చి 6న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే సోదరుడి వివాహం సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖుల కోసం అల్లు అర్జున్ (Allu Arjun) తన నివాసంలో ఓ గ్రాండ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీకి రామ్‌చరణ్ (Ram Charan) దంపతులతో పాటు పలువురు సెలెబ్రెటీలు హాజరయ్యారు. అయితే ఈ పార్టీకి రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో హాజరైన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయ్యప్ప స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా వెళ్తారు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వివాదంపై అల్లు శిరీష్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయారని అల్లు శిరీష్ పేర్కొన్నారు.. రామ్ చరణ్ ఆ పార్టీకి చాలా ముందుగానే వచ్చారని, ఆ సమయంలో అసలు అక్కడ పార్టీనే మొదలవలేదని తెలిపారు. ఆ సమయంలో ఎవరూ ఆల్కహాల్ తీసుకోలేదని, రామ్ చరణ్ వచ్చి రాగానే శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు. అయ్యప్ప స్వామి దీక్ష పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో తనకు తెలుసని శిరీష్ వెల్లడించారు.
కాగా, రామ్ చరణ్ ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా చురుగ్గా ఉంటాడని విషయం తెలిసిందే. సినిమాలతో పాటు భక్తిభావం కూడా చూపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రతి సంవత్సరం రామ్ చరణ్ అయ్యప్ప మాల వేసుకుంటాడు. ఆధ్యాత్మిక భావనలో ఉండడంతో పాటు మనసు ప్రశాంతగా ఉండడం కోసం రామ్ చరణ్ ప్రతి యేట అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పెద్ది (Peddi) పై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది.

