‘SSMB29’: మహేశ్ – రాజమౌళి మూవీ.. రంగంలోకి మరో స్టార్ డైరెక్టర్

by | Apr 13, 2025 | సినిమా

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబుల కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథను అందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఈ సినిమా వ‌స్తుండ‌టంతో పాటు మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి కాంబోలో ఫ‌స్ట్ మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేది గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ‘డైలాగ్‌ రైటర్‌’గా ప్రముఖ దర్శకుడు దేవా కట్టా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి దేవా కట్టా తనదైన శైలిలో అద్భుతమైన డైలాగులను అందించినట్లు సమాచారం.

గతంలో రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాకు డైలాగ్‌ రైటర్స్‌గా విజయ్‌ కుమార్‌, అజయ్‌ కుమార్‌ తో పాటుగా దేవా కట్టా పనిచేశారు. అయితే, ఆ తర్వాత చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి బుర్రా సాయి మాధవ్‌ను పనిచేశారు. ఇక ద‌ర్శ‌కుడు దేవకట్టా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దేవా తొలి సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిప‌బ్లిక్ వంటి సినిమాల‌తో త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దేవ‌క‌ట్టా సినిమాలు అటు రాజ‌కీయ కోణంతో పాటు సామ‌జిక స‌మ‌స్య‌లను ప్ర‌తిబింబించేలాగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అలాంటి దేవా కట్టా మహేశ్ (Mahesh Babu) – రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా, ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్ లను పూర్తి చేసిన రాజమౌళి మూడో షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా స‌మాచారం. ఇక ఈ సినిమాను 2027, మార్చి 25న ‘SSMB29’ విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.