యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల టైటిల్ పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రం ‘దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కగా.. దేవర మొదటి భాగం గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సఫీస్ వద్ద కూడా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తూ.. రూ.500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జపాన్‌లో మార్చి 28న విడుదలై కళ్లు చెదిరే వసూళ్లు సాధిస్తోంది. దేవర సినిమా జపాన్ వర్షన్ కి మొదటి రెండు రోజుల్లో 11 మిలియన్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ తాజాగా హైదరాబాద్ కి చేరుకున్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నారు. మార్చి 28న విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ కేవలం ఐదురోజుల్లోనే రూ. 74 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల కోసం సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తుండటంతో అభిమానుల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. తన బావమరిది నార్నె నితిన్ ‘మ్యాడ్ స్క్వేర్’తో భారీ హిట్ కొట్టడంతో కొట్టడంతో ఆయన ఎలా స్పందిస్తారో అన్నది చూడాలి. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సక్సెస్ మీట్ తర్వాత మరికొన్ని రోజుల్లోనే తన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా ఉన్నారు. ఏప్రిల్ 18న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించారు. విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏదేమైనా ఈ రెండు కార్యక్రమాలతో ఎన్టీఆర్ నందమూరి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇస్తున్నాడనే చెప్పాలి.


