గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ (Nithin) తాజాగా తన కొత్త సినిమా ప్రకటించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్‌తో తన తదుపరి సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది నితిన్ కెరీర్‌లో 36వ సినిమాగా తెరకెక్కనుండగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీ నిర్మించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో షేర్ చేశారు మేకర్స్. దీనికి నో బాడీ నో రూల్స్ అనే క్యాప్షన్ జతచేశారు. ఈ పోస్టర్‌లో గుబురు గడ్డంతో నితిన్ సిగరెట్ తాగుతున్నట్లుగా చూపించారు. సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్.
కాగా, గత కొన్ని రోజులుగా హీరో నితిన్ సరైన హిట్ సాదించలేదన్న సంగతి తెలిసిందే. గత పదేళ్ల కాలంలో నితిన్ నటించిన చిత్రాలలో భీష్మ మాత్రమే సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది భారీ అంచనాలతో వచ్చిన తమ్ముడు సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఇక బలగం ఫేమ్ వేణు తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ సినిమాలో నితిన్ నటించనున్నారు అనే వార్తలు వినిపించాయి. కానీ, ఆ సినిమా చివరకు దేవిశ్రీప్రసాద్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆనంద్ చెప్పిన స్టోరీ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా వీఐ ఆనంద్ (Anand) ఇప్పటికే తన మార్క్ చూపించిన సంగతి తెలిసిందే. హృదయం ఎక్కడున్నాది, టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం, డిస్కోరాజా, ఊరు పేర భైరవకోన వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

