నేచురల్ స్టార్ నాని, క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందా ? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నానితో దసరా సినిమాను చేసి కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాను రూపొందిస్తున్నారు. దాంతో పాటుగా నాని హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి కథానాయిక. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత నాని శేఖర్ కమ్ములతో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా, కింగ్ నాగార్జున కీలక పాత్రల్లో ‘కుబేర’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా ముగిసిన వెంటనే నానితో సినిమా చేయాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాని ఫ్యాన్ బేస్ ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కథను కూడా సిద్ధం చేశాడట. తాజాగా ఈ మూవీ స్క్రిప్ట్ నానికి వినిపించగా, అది ఆయనకి తెగ నచ్చిందట. దీంతో ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం ఖాయమైనట్లు తెలుస్తోంది.
ఈ మూవీలో నానికి జోడిగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఇప్పటికే శేఖర్ కమ్ములతో రెండు సినిమాలు చేయగా, నానితో కూడా ఎంసీఏ, శ్యామసింగ రాయ్ వంటి చిత్రాల్లో కలిసి నటించింది. ఈ సినిమాలో మరోసారి కలిసి నటిస్తే కనుక ఈ సూపర్ పెయిర్ హ్యాట్రిక్‌గా స్క్రీన్‌పై కనిపిస్తారు. ఈ ఏడాది చివర్లో ఈ నానితో చేయబోయే సినిమా చిత్రీకరణ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

