చిరు క్రేజీ లైనప్‌.. వరుస సినిమాలతో విందుభోజనమేనట!

by | Mar 20, 2025 | సినిమా

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ నట దిగ్గజం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. యువ హీరోల‌తో పోటీ ప‌డుతూ మరి చిరంజీవి వ‌రుస సినిమాలు చేస్తున్నారు. ఒక మూవీ సెట్స్ పై ఉండ‌గానే త‌ర్వాతి సినిమా దర్శకుడిని ఓకే చేసేస్తున్నారు చిరు. ఈ మ‌ధ్య మెగాస్టార్ పాత ద‌ర్శ‌కులితో కాకుండా యువ డైరెక్ట‌ర్స్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం చిరంజీవి బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర (Viswambhara) చిత్రం చేస్తున్నారు. మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ జానర్ లో ఈ మూవీ తెర‌కెక్కుతుంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కావాలి. కాని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే మూవీని మేలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా ఈ చిత్రం మ‌రికొన్ని రోజులు వాయిదా ప‌డేలా క‌నిపిస్తుంది. ఇక ‘విశ్వంభ‌ర‌’ త‌ర‌వాత చిరు వరుస సినిమాలు చేయనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవ్వగా..ఈ సినిమా జూన్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తుంది. అభిమానులు మిస్‌ అవుతున్న చిరంజీవి (Chiranjeevi) మార్క్‌ కామెడీ జానర్‌ను అనిల్‌ రావిపూడి ఈ సినిమాతో అందించనున్నారని సమాచారం. అలాగే యువ దర్శకుడు బాబితో మూవీ చేసేందుకు చిరంజీవి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘వాల్తేరు వీర‌య్య’ మూవీ బాక్సఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో కమర్షియల్ మూవీ రానున్నట్లు తెలుస్తోంది.

అలాగే ‘ద‌స‌రా’ ఫేమ్ శ్రీ‌కాంత్ ఓదెల‌తో కూడా చిరంజీవి ఓ సినిమా చేయ‌బోతున్నారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీ‌కాంత్ ఓదెల నానితో ‘పార‌డైజ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగియగానే చిరంజీవితో (Chiranjeevi) సినిమా పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘ల‌క్కీ భాస్క‌ర్‌’ ఫేమ్ వెంకీ అట్లూరి కూడా చిరంజీవి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరును కలిసిన వెంకీ తన కథను వినిపించగా చిరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో సినిమా చేస్తుండగా అ సినిమా షూటింగ్ అవగానే చిరుతో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇలా యువ దర్శకులతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తూ మెగాస్టార్‌ తనకు ఎవరూ సాటి లేరని ప్రూవ్ చేస్తున్నారు.