‘మీరు లేనిదే నేను లేను’- ఫ్యాన్స్‌కు చిరు ఎమోష‌న‌ల్ నోట్

by | Jan 21, 2026 | సినిమా

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మరోసారి తన స్టామినా చూపిస్తూ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సంద‌ర్భంగా సినిమా సాధించిన అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు.

“మన శంకరవరప్రసాద్ (Mana Shankara Vara Prasad Garu) గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE అనిల్ రావిపూడికి (Anil Ravipudi) , నిర్మాతలు సాహు (Sahu Garapati) , సుస్మితలకు (Sushmitha) , అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు.. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో… లవ్ యూ ఆల్ .. ఇట్లు మీ చిరంజీవి.” అంటూ చిరు రాసుకొచ్చారు.

కాగా, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన “మన శంకర వరప్రసాద్‌గారు” బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ మెగాస్టార్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ ఉండేది. ఆ సినిమా రూ.244 కోట్లు గ్రాస్‌ కలెక్షన్స్ వసూలు చేయగా.. తాజాగా ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu) మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో మెగాస్టార్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.