మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) కథానాయకుడిగా అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇదే జోష్ లో ఇప్పుడు చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ (Bobby) తో చేయనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరు, బాబీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) సంస్థ భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినీ జనాల కోసం ఓ అప్డేట్ వచ్చింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి మొదటి వారం నుంచి మొదలు కానుందట. 20 రోజులపాటు ఫస్ట్ షెడ్యూల్ కొనసాగనుండగా.. దీనిపై టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడని ఇప్పటివరకున్న టాక్. అలాగే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా ‘పొన్నియిన్ సెల్వన్’ ఫేమ్, ధురంధర్ మూవీ హీరోయిన్ సారా అర్జున్ (Sara Arjun) పేరును మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.

