మహాశివరాత్రి (Maha Shivaratri) సందర్భంగా పంచారామాలలో ఒకటైన సోమారామం గురించి తెలుసుకుందాం.
పంచారామాలలో ఒకటి గా భక్తులచే పూజలందుకుంటోన్న శ్రీ సోమేశ్వర స్వామి (Someswara Swamy Temple) వారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గౌతమీ నదీ తీరాన గునుపూడి అనే గ్రామంలో ఉంది. ఇక్కడి శివలింగము చంద్రునిచే ప్రతిష్టించబడినందున దీనిని సోమేశ్వర లింగం అని కూడా అంటారు
సదాశివుని ఆదేశముచే కుమారస్వామిచే గురిచూసి కొట్టబడ్డ తారకేశ్వరుని కంఠములోని అమృత లింగము ఐదు ముక్కలై ఐదు చోట్ల పడ్డాయి. అందులో ఒక ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలో గునుపూడి అనే ప్రాంతంలో పడ్డది. శివుని ఆదేశానుసారం, దేవగురువు బృహస్పతి సలహాపై దేవతలలో ఒకరైన చంద్రుడు దేవగణముతో వచ్చి ఆశ్వియుజ శుద్ధ దశమి రోజున శివలింగ ప్రతిష్ట జరిపారు. ఈ శకలాలు పడ్డచోట ఓం అనే శబ్దంతో పడ్డాయి. క్షీరారామంలో తప్ప మిగతా ప్రదేశాలలో ఒకే సమయములో వివిధ దేవతలచేత ఈ లింగాలు ప్రతిష్టించబడ్డాయి
తూర్పు చాళుక్యులలో మొదటి వాడైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు జనార్ధన స్వామి. అందువలన ఈ క్షేత్రాన్ని సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంగా కూడా భక్తులు పిలుస్తారు. ఈ ప్రదేశమునందు ఐదు నందులు ఉన్నాయి. అందువలన ఈ ఆలయమును ఐదు నందుల ఆలయం అని కూడా పిలుస్తారు. ఐదు నందులలో ఒకటి కోనేరులోనూ, రెండవది కోనేటికి వెలుపల, మూడవది ఆవరణలో ఉన్న ధ్వజస్థంబము వద్దను, మిగిలిన రెండు నందులు ద్వజస్థంభమునకు సమీపంలో కలవు.
అగస్త్య మహర్షి కాశీ వియోగ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి గోదావరితీరం నందు వివిధ క్షేత్రాలు దర్శిస్తూ క్షీరారామము, ఈ సోమారామములను దర్శించినట్లు శ్రీనాధుడు తన కాశీ ఖండంలో తెలియ చేశాడు.
ఈ భీమవరం ను సోమా రామం అని కూడా అంటారు. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ శివలింగంను ప్రార్దించిన వారికి సర్వ వ్యాధులు తొలగునని, పంచ మహాపాతకములు హరించునని భక్తుల నమ్మకం.
చంద్రునిచే ప్రతిష్టింపబడుట వలన ఈ శివలింగముపై షోడశ (పదహారు) కళలు కనిపించును. శ్వేత వర్ణములో కనిపించే ఈ శివలింగము క్రమక్రమముగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాతధంగా శ్వేత వర్ణములో కనిపిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి, అమావాస్యకి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తెలుస్తుంది. ఈ లింగానికి ఉన్న నాగాభరణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది
ఈ ఆలయ ప్రాంగణానికి తూర్పు దిశగా ఉన్న కోనేరుని సోమగుండం లేక చంద్ర పుష్కరిణి అని పిలుస్తారు. ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే ఆలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది
ఆ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఆది దేవుడు, సోమేశ్వరుడు క్రింది అంతస్థులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన రెండవ అంతస్థులో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
ఈ ఆలయం త్రేతా యుగము నాటిదని, చంద్రుడు దేవగణముతో వచ్చి ఆలయములో క్రింది భాగమును నిర్మించి, అందులో శివుని ప్రతిష్టించి, తమను ఎవరూ గుర్తించకుండా తెల్లవారకమునుపే, దేవలోకానికి వెళ్లిపోయారట! ఆ విధంగా వారు పరమేశ్వరుని ఒక్కడినే ప్రతిష్టించి, అమ్మవారైన అన్నపూర్ణాదేవిని ప్రతిష్టించకపోవుటచే శివుడు కోపంతో దేవలోకము వైపు చూడగా, దేవతలు భయపడి అతని కోపము తగ్గించేందుకు, మరొక రాత్రి వచ్చి, ఆలయము పైన మరొక అంతస్థును నిర్మించి, అందులో అన్నపూర్ణాదేవిని ప్రతిష్టించి పరమేశ్వరుని శాంతింపచేశారని స్థల పురాణం మనకు వివరిస్తున్నది.
ఈ ఆలయము క్రింది అంతస్థులో గర్భాలయము నందు తూర్పు ముఖంగా శ్రీ ఉమాసోమేశ్వరుడు దర్శనమీయగా, పై అంతస్థులో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ప్రాకారానికి దక్షిణ దిశలో స్వామివారి కల్యాణమండపం, ప్రాకారానికి పడమర దిశలో కుమారస్వామి వారి ఆలయం, చిన్న శివుడి ఆలయం, జనార్దనస్వామి ఆలయం, ఉత్తర దిశయందు హనుమాన్ మందిరం, నవగ్రహ మండపము, ప్రవేశ ద్వారానికి అనుకుని కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వరాలయం, ఎడమవైపున సూర్యనారాయణమూర్తి ఆలయాలు కలవు. ఇది హరిహర క్షేత్రంగా పేరు పొందింది
ఇచ్చట అర్చనలు, ప్రత్యేక పూజలే కాక దసరా ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు మొదలైనవి మహా వైభవముగా జరుగుతాయి
కార్తీక మాసంలో ఎంతో ప్రాముఖ్యమున్న దీపదానం, సాలిగ్రామ దానం, అభిషేకాలు వంటి వాటిని చూడవచ్చు.
ఈ ఆలయం పాలకొల్లుకు 23 కిలో మీటర్ల దూరంలో, కైకలూరుకు 38 కిలో మీటర్ల దూరంలో, గుడివాడకు 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాద్ నుండు బస్సు, రైలు సౌకర్యాలు కూడా ఉన్నాయి

