కడుపుబ్బా నవ్విస్తున్న ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ట్రైలర్

by | Mar 26, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వ‌స్తున్న తాజా చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. సూప‌ర్ హిట్ చిత్రం మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన సాంగ్స్, టీజర్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మ్యాడ్ లో కంటే ఇందులోనే కామెడీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆధ్యంతం కడుపుబ్బా నవ్విస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీ కథ విషయానికొస్తే.. లడ్డుగాని పెళ్లికి వ‌చ్చిన ఫ్రెండ్స్ గ్యాంగ్ బ్యాచిల‌ర్ పార్టీ కోసం గోవాకి వెళ్లగా కథ అక్కడ మలుపు తిరుగుతుందనే స్టోరీ లైన్ తో మరోసారి నవ్వుల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణులు మ్యాడ్ మూవీని మించేలా ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ పండించబోతున్నారని తెలుస్తోంది.