దేశ రాజకీయాల్లో గత రెండేళ్లుగా ఒకటే హాట్ టాపిక్.. ఒకటే పెను సంచలనం. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఇన్నాళ్లు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్సీలు.. ఇలా దేశంలోనే టాప్ లీడర్లంతా జైలు పాలయ్యారు. కానీ, ఇవాళ భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే ఒక సంచలన తీర్పు వచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) కు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, మనీశ్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు భారీ ఊరటనిచ్చింది. సీబీఐ నమోదు చేసిన కేసులను సమూలంగా కొట్టివేసింది. అసలు ఈ రోజు కోర్టులో ఏం జరిగింది? పూర్తి ఆధారాల్లేకుండా దర్యాప్తు సంస్థలు వీళ్ల పేర్లను ఎలా ఇరికించాయి? ఈరోజు మనం విశ్లేషిద్దాం.. ఒకసారి ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన పరిణామాలను నిశితంగా గమనిస్తే.. దర్యాప్తు సంస్థల తీరుపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కవితకి, ఆమె ఆడిటర్ బుచ్చిబాబుతో సహా మొత్తం 22 మంది నిందితులకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. అసలు అభియోగాలు మోపడానికి సరైన ఆధారాలు ఏవి? అని కోర్టు ప్రశ్నించింది.
డిశ్చార్జ్ పిటిషన్ల పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. కేవలం ఆరోపణల ఆధారంగా, బలమైన సాక్ష్యాలు లేకుండా ఒక ప్రజాప్రతినిధిని ఎలా దోషిగా నిలబెడతారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవితకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ రావడంతో అటు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? ఒకసారి మనం 2021 నవంబర్ 17కు వెళ్లాలి. ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆదాయం పెంచడం, మాఫియాను అరికట్టడం దీని ఉద్దేశం అని ఆప్ సర్కార్ చెప్పింది. కానీ, అందులో వందల కోట్ల అవకతవకలు జరిగాయని, సౌత్ గ్రూప్ ఎంటర్ అయిందని ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి. లైసెన్సులు కావాల్సిన వాళ్ల దగ్గర నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో 2022 సెప్టెంబర్ లో ఆ పాలసీ రద్దయింది. ఆ తర్వాత వరుస అరెస్టులు. మనీశ్ సిసోడియా, ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత, ఆ తర్వాత ఏకంగా సిట్టింగ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్! ఇదంతా చూస్తుంటే ప్రతిపక్షాలను టార్గెట్ చేశారా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా నాటుకుపోయాయి. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ అనుమానాలే నిజమయ్యాయా.. ఈ తీర్పు రాగానే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించిన తీరు దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఎప్పుడూ నవ్వుతూ, పోరాడే కేజ్రీవాల్.. ఇవాళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘నేను అవినీతిపరుడిని కాదు.. నా జీవితంలో నేను సంపాదించిన ఏకైక ఆస్తి నా నిజాయితీ మాత్రమే’ అంటూ ఆయన కన్నీటి పర్యంతం అవ్వడం ఆప్ కేడర్ ను కదిలించింది. తన కుటుంబ సభ్యులతో కలిసి మిఠాయిలు తినిపించుకుంటూ ఆయన చేసుకున్న సంబురాలు.. ఒక నిబద్ధత గల నాయకుడి ఆవేదనకు అద్దం పడుతున్నాయి. ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ శ్రేణులు, అటు ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. సత్యమేవ జయతే అంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ట్రయల్ కోర్టు తీర్పుపై తాము సైలెంట్ గా ఉండేది లేదని, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ రాజకీయ చదరంగం ఇంకా ముగియలేదా? హైకోర్టులో సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపించబోతోంది? కవిత, కేజ్రీవాల్ ల లీగల్ టీమ్ దాన్ని ఎలా కౌంటర్ చేయబోతోంది? ఇది భవిష్యత్తు రాజకీయాలను ఎలా మలుపు తిప్పబోతోంది.. ఇదీ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ జరిగిన మహా సంచలనం. నిజా నిజాలు కాలమే నిర్ణయిస్తుంది కానీ.. ప్రస్తుతానికి అయితే కవిత, కేజ్రీవాల్, సిసోడియాలకు ఇది అతిపెద్ద విజయం. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది..

