టాలీవుడ్ సీనియర్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో భారతీయ చిత్ర పరిశ్రమల్లో పేరొందిన ఎందరో నటీనటులు భాగమాయ్యరు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వంటి అగ్ర కథనాయకులు కూడా నటిస్తున్నారు. అయితే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది.
తాజాగా ఈ విషయంపై మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలిపాడు. తన తండ్రి మంచు మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో సినిమాలో రుద్ర అనే పాత్రలో నటించేందుకు ప్రభాస్ ఒప్పుకున్నాడని అందుకే ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికంగా ప్రభాస్ తీసుకోలేదని మంచు విష్ణు వెల్లడించాడు. ప్రభాస్ తో పాటుగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
కాగా, మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ మూవీలో మోహన్‌బాబుతో పాటుగా శరత్‌కుమార్, మధుబాల, ముఖేష్‌రిషి, బ్రహ్మానందం బ్రహ్మాజీ, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

