విడుదల తేది: 10–04–2025
నటీనటులు: సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ, రవివర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: విజయ్ కే చక్రవర్తి
ఎడిటర్: నవీన్ నూలి
సంగీతం: అచ్చు రాజమణి, సామ్ సి.ఎస్
నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్
నిర్మాత: బివిఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
టాలీవుడ్ లో గతేడాది టిల్లు స్క్వేర్‌తో అభిమానులను అలరించిన యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ? టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సిద్దూ జాక్ మూవీతో ఆడియన్స్ ను ఎలా మెప్పించారు? సిద్దూ, వైష్ణవి చైతన్య జోడీ ఎలా ఆకట్టుకుంది వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ)కు చిన్ననాటి నుంచి ఒక కల ఉంటుంది. ఇండియన్ రా ఏజెన్సీలో ఉద్యోగం చేస్తూ, దేశానికి ఎలాంటి హాని జరగకుండా చూడాలని అనుకుంటాడు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి ప్రసాద్ (సీనియర్ నరేష్ ) ఓ డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయిస్తాడు. ఆ డిటెక్టివ్ ఓనర్ కూతురు భానుమతి అలియాస్ అఫ్సాన్ (వైష్ణవి చైతన్య) తన టీమ్ తో కలిసి జాక్ ఏం చేస్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలోనే దేశంపై టెర్రర్ అటాక్స్ చేయడానికి నుజీఫర్ రెహమాన్ (రాహుల్ దేవ్) ప్లాన్ చేస్తుంటాడు. తన దగ్గర్నుంచి కొందరు టెర్రరిస్టులను ఇండియాకు పంపిస్తాడు. అయితే ఆ టెర్రరిస్టులను పట్టుకోడానికి రా చీఫ్ మనోజ్ (ప్రకాశ్ రాజ్) రంగంలోకి దిగుతాడు. కానీ జాక్ రావడంతో వాళ్ల మిషన్ అంతా చెడిపోతుంది. అసలు
రా ఉద్యోగం కోసమే జాక్ ఎందుకు ప్రయత్నిస్తాడు ? దేశాన్ని నాశనం చేయాలనుకున్న వారిని జాక్ ఎలా పట్టుకున్నాడు ? టెర్రరిస్ట్ రెహమాన్ అసలేం ప్లాన్ చేసాడు? వైష్ణవితో లవ్ ట్రాక్ ఎక్కడి వరకూ వెళ్లింది అనేది మిగిలిన కథ.
విశ్లేషణ:
జాక్ గా సిద్ధు జొన్నలగడ్డ తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మరోసారి తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. వైష్ణవి చైతన్య నటనలో కొత్తదనం లేదు. కాస్త గ్లామరస్ గా కనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. రాహుల్ దేవ్ విలనిజం కూడా అంతగా ఆకట్టుకోలేదు. ప్రకాష్ రాజ్ తాను పోషించిన రా ఆఫీసర్ పాత్రలో జీవించేశారు. హీరో తండ్రిగా నరేష్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. సుబ్బరాజు, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ రాసుకున్న కథ కొత్తగా లేకపోయినా, కథనంతో నడిపించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అటు ఇటు దర్శకుడిగా భాస్కర్ పూర్తిగా నిరాశపరిచారు. బొమ్మరిల్లు, పరుగు వంటి మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ని అందించిన భాస్కర్, కొత్తగా స్పై థ్రిల్లర్ జానర్ లో సినిమా చేయడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అంచనాలు అందుకోవడంలో భాస్కర్ పూర్తిగా విఫలమయ్యారు. ఇందులో బలమైన సన్నివేశాలు లేకపోయినా.. కేవలం స్క్రీన్ ప్లేతో సినిమాను నెట్టుకొచ్చాడు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫి బాగుంది. ఈ చిత్రానికి అచ్చు రాజమణి, సామ్ సీఎస్, సురేష్ బొబ్బిలి ఇలా ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ ఒక్క సాంగ్ కూడా ఆకట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
సిద్దూ, ప్రకాష్ రాజ్ నటన
కామెడీ,
స్టైలిష్ యాక్షన్, ఎలివేషన్
మైనస్ పాయింట్స్:
ఆసక్తి రేకెత్తించని కథ, కథనాలు
కొరవడిన భావోద్వేగాలు
రేటింగ్: 2.5/5

