సెంచరీలతో చెలరేగిపోయిన మిచెల్, ఫిలిప్స్ ; భారత జట్టు లక్ష్యం 338 పరుగులు
India Vs New Zealand 3rd ODI : భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇండోర్ (Indore) లో జరుగుతోన్న మూడవ వన్ డే మ్యాచ్ భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది
న్యూజిలాండ్ జట్టుకు ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అర్ష్ దీప్ బౌలింగ్ లో ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ హెన్రీ నికోల్స్ మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తరవాత ఓవర్ మొదటి బంతికి హర్షిత్ రానా బౌలింగ్ లో మరో ఓపెనర్ డేవాన్ కాన్వే 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ జట్టు ను, ఆ తరవాత వచ్చిన డరిల్ మిచెల్, విల్ యంగ్ లు మూడవ వికెట్ కు 53 పరుగులు జోడించి ఆదుకున్నారు. 30 పరుగులు చేసిన విల్ యంగ్ హర్షిత్ రానా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు
ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న మిచెల్ తో ఫిలిప్స్ జత కలిశాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ సెటిల్ అయిన తరవాత వేగం పెంచి స్కోర్ బోర్డు ను పరిగెత్తించారు. నాలుగవ వికెట్ కు మిచెల్, ఫిలిప్స్ లు 219 పరుగులు జోడించారు.
ఇన్నింగ్స్ 44 వ ఓవర్లో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. 88 బంతుల్లో 106 పరుగులు చేసిన ఫిలిప్స్ అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఫిలిప్స్ ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. ఫిలిప్స్ (Philips) అవుట్ అయిన తరవాతి ఓవర్ లో 131 బంతుల్లో 137 పరుగులు చేసిన మిచెల్ కూడా అవుట్ అయ్యాడు, మిచెల్ (Mitchell) ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు, పదిహేను బౌండరీలు ఉన్నాయి
చివర్లో న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్ వెల్ 18 బంతుల్లో, మూడు సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేశాడు. క్లార్క్ 11 పరుగులతో బ్రేస్ వెల్ కు చక్కని సహకారం అందించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేయగలిగింది
మొదటి రెండు ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్, చివరకు నిర్ణీత 50 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ చివరి 60 పరుగులు చేయడానికి 5 వికెట్లను కోల్పోయింది
భారత జట్టు బౌలర్ల లో పేసర్ లు అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) , హర్షిత్ రానా (Harshit Rana) లు మూడేసి వికెట్లు తీసుకోగా, అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ (Siraj) కు మిచెల్ వికెట్ దక్కింది. కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నప్పటికీ, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ యాదవ్ లు ప్రభావం చూపలేకపోయారు.

