భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య వడోదర లో జరిగిన మొదటి వన్ డే మ్యాచ్ లో భారత జట్టు న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కీలక సమయాలలో క్యాచ్ లు జార విడిచి న్యూజిలాండ్ తగిన మూల్యం చెల్లించుకుంది
301 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 39 పరుగుల వద్ద రోహిత్ శర్మ వికెట్ ను కోల్పోయింది. రోహిత్ 29 బంతుల్లో 26 పరుగులు చేసి జేమిసన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
ఆ తరవాత వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్ మన్ గిల్ లు రెండవ వికెట్ కు 118 పరుగులు జోడించారు. 56 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్ అవుట్ అయిన వెంటనే విరాట్ కోహ్లీ కూడా 93 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కాసేపటికే 4 పరుగులు చేసిన రవీంద్ర జడేజా అవుట్ అయ్యాడు. మరో పక్క నిలకడగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ 47 బంతుల్లో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
హర్షిత్ రానా కాసేపు పోరాడి 23 బంతుల్లో 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కె ఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ లు జాగ్రత్తగా ఆడి భారత జట్టును గెలిపించారు. కె ఎల్ రాహుల్ 29 పరుగులతో, వాషింగ్టన్ సుందర్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు
న్యూజిలాండ్ బౌలర్లలో జేమిసన్ నాలుగు వికెట్లు తీయగా, ఆదిత్య అశోక్, క్లార్క్ లు చెరో ఒక వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్ల లో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ కు ఓపెనర్లు కాన్వే, నికోల్స్ లు చక్కని శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు మొదటి వికెట్ కు 117 పరుగులు జోడించారు. కాన్వే 56 పరుగులు , నికోల్స్ 62 పరుగులు చేసి వెంట వెంటనే అవుట్ అయ్యారు
అక్కడి నుండి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే సెకండ్ డౌన్ లో వచ్చిన మిచెల్ గోడలా నిలబడి స్కోర్ బోర్డును కదిలిస్తూ వచ్చాడు. 71 బంతుల్లో 84 పరుగులు చేసిన మిచెల్ 48 వ ఓవర్లో అవుట్ అయ్యాడు. లోయర్ ఆర్డర్ ఆటగాడు, మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోన్న క్లార్క్ తో కలిసి మిచెల్ ఎనిమిదవ వికెట్ కు 42 పరుగులు జోడించారు.
క్లార్క్ 17 బంతుల్లో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆఖరి ఓవర్ లో లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు క్లార్క్, జేమిసన్ లు 14 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 300 పరుగుల మార్క్ అందుకుంది
భారత జట్టు బౌలర్ల లో పేసర్ లు సిరాజ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణ లు తలా రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది

