‘హరి హర వీరమల్లు’.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి భారీ గుడ్ న్యూస్

by | Mar 30, 2025 | సినిమా

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు.

అయితే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం నిజానికి మార్చి 28న విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా, చిత్రీకరణ పూర్తి కానందున వాయిదా ప‌డింది. ఈ క్రమంలోనే మేలో విడుదల చేస్తామని ఇటీవల చిత్ర బృందం ప్రకటించారు. కానీ ఈసారైనా చెప్పిన తేదీకి వస్తారో లేదో అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉగాది రోజు హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమాకి సంబంధించి ప్ర‌త్యేక పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఈ సినిమా మే 9న పక్కాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంద‌ని మరోసారి ప్రకటించారు. దీంతో ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారు చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే డబ్బింగ్ పార్ట్‌ను కూడా ఇటీవలే ప్రారంభించారు. అయితే ఈ సినిమాకు చివరి షెడ్యూల్ ప్రస్తుతం ఖమ్మంలో ప్రారంభమైంది. అయితే ఈ షెడ్యూల్ లో పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తోనే షూటింగ్‌ పూర్తి కానుంద‌ని, ఆ త‌ర్వాత పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులను వేగవంతం చేసి మే 9న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల కానుంది.