మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopi Chand) కథానాయకుడిగా ‘ఘాజీ’ఫేం సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘గోపీచంద్33’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా ఉన్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. 7వ శతాబ్దం నేపథ్యంలో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని చారిత్రక ఘటనను ఆవిష్కరిస్తూ, రూపొందిస్తున్న చిత్రమిదని తెలుస్తోంది. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గోపీచంద్ తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ విభిన్నమైన పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ సారథ్యంలో ఓ హై ఇంటెన్సిటీ క్లైమాక్స్ ఎపిసోడ్ ని చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో గోపీచంద్(Gopi Chand) తోపాటు ప్రధాన తారాగణం పాల్గొననుండగా.. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. అయితే రాత్రి సమయంలో ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు హైద్రాబాద్ శివార్లలో ప్రత్యేకంగా భారీ సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. నాలుగు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ ముగియనుంది. అయితే ఈ మూవీ క్లైమాక్స్ ఎపిసోడ్ తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా ఉండబోతుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రానికి ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది.

