Gandhi Talks Review : మూకీ మూవీ ప్రేక్షకుల్ని మెప్పించిందా.?

by | Jan 30, 2026 | సినిమా రివ్యూ

విడుదల తేది: 30–01–2026
నటీనటులు: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:

కెమెరా: కరణ్ బి రావత్
సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ (Rehman)
నిర్మాణ సంస్థ: జీ స్టూడియోస్‌ (Zee Studio)
నిర్మాతలు: రాజేష్ కేజ్రీవాల్, ఉమేష్ కుమార్ బన్సల్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిషోర్ బెలేకర్

తమిళ అగ్ర నటులు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) , అరవింద్‌ స్వామి (Aravind Swamy) ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్‌’ (Gandhi Talks) . ఇందులో అదితి రావు హైదరీ (Aditi Rao Hydari) , సిద్ధార్థ్‌ జాదవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిషోర్‌ పి. బెలేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతోనే అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. ఈ సినిమాలో మాటలు లేకపోయినా, కేవలం నటీనటుల హావభావాలు, సంగీతంతోనే కథను ప్రేక్షకుల హృదయాలకు చేరువ చేసేలా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్‌, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీని ఉమేష్ కుమార్ బన్సల్, రాజేష్ కేజ్రీవాల్ నిర్మిస్తున్నారు. ఇక ఇది మూకీ సినిమా అయినప్పటికీ తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, మలయాళ భాషల్లో టైటిల్ కార్డులు, ప్రమోషన్లతో గాంధీజీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న గ్రాండ్‌గా విడుదల చేశారు. మరి ఈ సినిమాలోని కొత్తదనం ఏంటి ? ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించింది ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.

కథ.

ముంబైలోని ధారావి మురికివాడల ప్రాంతంలో నివసించే నిరుద్యోగి మహదేవ్ విష్ణు (విజయ్ సేతుపతి) ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు రేయింబవళ్లు కష్టపడుతుంటాడు. ఈ క్రమంలోనే ముంబై మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ. 50000 లంచం అడుగుతారు. తాను ప్రేమించిన అమ్మాయి (అదితి రావు హైదరి) తనకు దక్కాలంటే ఆ ఉద్యోగం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే తనకు అవసరమైన డబ్బు కోసం చెడు దారులను ఎంచుకుంటాడు. ఇక మరోవైపు ముంబైలో ఒకప్పుడు బోస్ మన్ (అరవింద్ స్వామి) బడా వ్యాపారవేత్తగా ఉండేవాడు. కొన్ని కారణాల వల్ల తన వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతాడు. దీంతో ఈ సమస్యల నుంచి బయట పడేందుకు బోస్ మన్ ఒక ప్లాన్ వేస్తాడు. మరి అదేంటి ? ఆ ప్లాన్ వల్ల ఈ ముగ్గురి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? చివరికి వీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా లేదా? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:

కొన్నేళ్ల క్రితం వెండి తెరపై కమల్ హాసన్ నటించిన ‘పుష్పక విమానం’ వంటి మూకీ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. అయితే ఇన్నేళ్ల తర్వాత అదే స్థాయిలో ఆకట్టుకోవడానికి ‘గాంధీ టాక్స్’ మూకీ వచ్చిందని చెప్పొచ్చు. ప్రతి కథకు మాటలు అవసరం లేదు.. కొన్ని దృశ్యాలు చూడడంతోనే మనసుకు హత్తుకుంటాయి అని ఈ సినిమాతో మరోసారి రుజువైంది. దర్శకుడిగా కిశోర్ పాండురంగ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన ఎంచుకున్న కథ రోటీన్ అయినా ఈ సినిమాను మలిచిన తీరు మాత్రం అద్భుతమనే చెప్పాలి. స్క్రీన్ ప్లే ఊహించదగ్గదే అయినా, క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. పరిమిత బడ్జెట్‌లో కూడా మంచి విజువల్స్, సాంగ్స్, కమర్షియల్ హంగులు తగ్గకుండా సినిమాను మలిచారు. ఇక మహదేవ్ పాత్రలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) అద్భుతమైన నటన కనబరిచారు. ఆయన అమాయకంగా నటించిన తీరు కష్టాలను ఎదుర్కొన్న విధానం సినిమాకు పెద్ద అసెట్ అని చెప్ప‌వ‌చ్చు. అదితి రావు హైదరి తాను పోషించిన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆమె పర్ఫార్మెన్స్ సర్ ప్రైజ్ చేస్తుంది. ఇక అరవింద్ స్వామి తన మార్కు మేనరిజమ్స్‌తో బిజినెస్ మేన్ పాత్రలో చక్కగా నటించారు. సిద్ధార్థ్ జాదవ్ దొంగ పాత్రలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు. ఇక మాటలు లేని ఈ సినిమాలో సంగీతమే ప్రాణం. అందుకే ఈ చిత్రానికి ఆస్కార్ విజేత, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలను అందించాడు.
నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. సందేశాత్మక చిత్రాలను, కమర్షియల్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఒక మంచి ఎంపిక.

ప్లస్ పాయింట్స్:
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరి నటన
ఏఆర్ రెహమాన్ సంగీతం
క్లైమాక్స్

మైనస్‌ పాయింట్స్‌:
కొత్తదనం లేని కథ, కథనం
సాగదీత సన్నివేశాలు