దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వారణాసి’. భారత సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ఆశయంతో రాజమౌళి (Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ (Teaser) ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందనను తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 07(బుధవారం), 2027న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించాడు. ఏప్రిల్ 07న ఉగాది, గుడి పడ్వా వంటి పండుగలు ఉండగా.. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి వంటి వరుస సెలవులు కలిసి వచ్చేలా ఈ విడుదల తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్న విషయం తెలిసిందే. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithvi Raj Sukumaran) ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు.
ఇక కేఎల్ నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సినిమాను సుమారు రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా, కథ విజయేంద్ర ప్రసాద్ అందించారు. కాగా, అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ‘వారణాసి’ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ విషయానికొస్తే.. ఇటీవల హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీతో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. అలాగే కోకాపేటలో భారీ వ్యయంతో వారణాసి (Varanasi) సెట్‌ను రూపొందించారట. ప్రస్తుతం ఇక్కడే మహేష్ బాబుతో పాటుగా ఇతర తారాగణం పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


