తొలి రోజే నెగెటివ్ టాక్.. ‘ఫంకీ’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?

by | Feb 15, 2026 | సినిమా

టాలీవుడ్ యువ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఫంకీ’ (Funky) లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘ఫంకీ’ చిత్రానికి ‘జాతిరత్నాలు’ఫేం కె.వి.అనుదీప్‌ (Anudeep) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ క‌యాదు లోహ‌ర్ కథానాయికగా నటించగా.. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ‘ఫంకీ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మొదటి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. ‘ఫంకీ’ సినిమా చాలా స్లోగా ఉండటం, అనుదీప్ టేకింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడం, విశ్వక్ సేన్ ను స‌రిగ్గా వాడుకోక‌పోవ‌డం, కయాదు లోహర్ పాత్ర కూడా పెద్ద ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం మూవీకి మైన‌స్ అయిందనే టాక్ వినిపిస్తోంది.

అయితే మొదటి రోజే సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూడా ‘ఫంకీ’ మూవీ బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపించింది. ఈ క్రమంలోనే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రూ. 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో రూ.1.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1 కోటి వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ వసూళ్లు కలుపుకుని మరో రూ.25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే వీక్ కావడంతో పాటుగా ప్రస్తుతం పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ చిత్రానికి అదనపు బలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.15 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సిఉంటుంది. కాగా, ఈ చిత్రాన్ని శ్రీక‌ర స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన‌మెంట్స్ (Sithara Entertainments) , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగవంశీ (Naga Vamsi) , సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు