గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు ఇటీవల రెండోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. జనవరి 31న ఉపాసన ఒక మగ బిడ్డకు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అంగరంగవైభవంగా ఫిబ్రవరి 11న మెగా వారసులకు నామకరణం కూడా చేశారు. ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు మెగాఫ్యామిలీ, కామినేని కుటుంబసభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. గతంలో పెద్ద కూతురికి ‘క్లీంకార’ (Kleenkara) అని పేరు పెట్టిన మెగా ఫ్యామిలీ ఈసారి కవలలకు కూడా అలాగే ప్రత్యేకమైన పేర్లతో నామకరణం చేశారు. కుమారుడికి శివరామ్ (Sivaram) అని నామకరణం చేయగా.. కూతురికి అన్వీరా దేవి (Anveera Devi) అని పేరు పెట్టారు. ఈ రామ్‌చరణ్, ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘మా ఇంట్లోకి వచ్చిన ఇద్దరు చిన్నారులకు పెట్టిన పేర్లను చూసి చాలా మంది అభినందిస్తున్నారు. నాకు ఇక్కడి నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఫోన్లు చేస్తూ అభినందిస్తున్నారు. సంతోషంతో నా హృదయం నిండిపోయింది. మన సంస్కృతిని కాపాడుతూ భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేసేలా ఆధ్యాత్మికత, సంస్కృతిని మేళవించిన ఈ పేర్లు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి పేర్లను ఎంపిక చేసినందుకు రామ్‌చరణ్, ఉపాసనకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే, చిన్నారి అన్వీరాకు తన నాన్నమ్మ అంజనా దేవి (Anjanaa Devi) గారి పేరులోని ‘దేవి’ని చేర్చుతూ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం నా మనసును కదిలించింది. ఆ దేవుడు ఎల్లప్పుడు మీకు అలాగే మీ పిల్లలకు రక్షణగా ఉండాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు రామ్ చరణ్ సతీమణి ఉసాపన లవ్యూ మామయ్య అని కామెంట్ చేశారు. మెగాస్టార్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

