తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో (Telangana Municipal Elections) అధికార కాంగ్రెస్ పార్టీ దుమ్మురేపింది. మొత్తం 116 మున్సిపాలిటీలలోని 2,582 వార్డుల్లో ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 1,347 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. దీంతో 66 మున్సిపాలిటీలను కాంగ్రెస్ (Congress) కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ (BRS) 717 వార్డుల్లో గెలుపొందింది. దాంతో 13 మున్సిపాలిటీలను ఆ పార్టీ సొంతం చేసుకుంది. బీజేపీ 261 వార్డుల్లో విజయం దక్కించుకుంది. ఇక ఇండిపెండెంట్ అభ్యర్థులు 256 వార్డుల్లో విజయం సాధించారు. ఇక 36 మున్సిపాలిటీల్లో మాత్రం ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో హంగ్ ఏర్పడింది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో హంగ్ ఏర్పడగా.. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. కొత్తగూడెంలో సీపీఐ తన సత్తా చాటింది. మొత్తం 60 డివిజన్లకు కాంగ్రెస్ 20, సీపీఐ 24 చోట్ల గెలుపు సాధించాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా: ఈ జిల్లాలో రెండు మున్సిపాలిటీలు బీఆర్ఎస్ దక్కించుకుంది. మిగిలినవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లా: ఈ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ దక్కించుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: ఈ జిల్లాలో ఆదిలాబాద్‌లో 21 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఇక కాగజ్ నగర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా: ఈ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ వశం కాగా.. మిగిలిన మునిసిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా: ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను ఖాతాలో వేసుకుంది. కేవలం రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ దక్కించుకుంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఒక్క నారాయణపేట మున్సిపాలిటీ మాత్రం బీజేపీ ఖాతాలో పడింది.
ఉమ్మడి మెదక్ జిల్లా: ఈ జిల్లాలో 10 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఈ జిల్లాలో బిజెపి (BJP) అత్యధిక స్థానాలు సాధించింది. 60 డివిజన్లు ఉండగా.. బిజిపి 28 కాంగ్రెస్ 17 స్థానాలు దక్కించుకున్నాయి.

