విడుదల తేది: 14–3–2025
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: డానియేల్ విశ్వాస్
సంగీతం: సామ్ సీఎస్
నిర్మాణ సంస్థ: శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్
ఎడిటర్: ప్రవీణ్
నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్
దర్శకత్వం: విశ్వ కరుణ్
టాలీవుడ్ యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), యంగ్ హీరోయిన్ క్వీన్ రుక్సార్ థిల్లాన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దిల్ రూబా’ (Dilruba) . ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్‌లకు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న.. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. దిల్ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హీరోగా కిరణ్ అబ్బవరం మరోసారి సక్సెస్ అయ్యాడా ? వంటి విషయాల్ని ఈ సమీక్షలో చూద్దాం.
కథ:
ఈ సినిమా కథలోకి వెళ్తే.. సిద్దు(కిరణ్ అబ్బవరం) మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. కానీ అనుకోని కారణాల వల్ల వీరిద్దరికీ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత మ్యాగీ పెళ్లి చేసుకొని యూఎస్ వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే సిద్దుకు తండ్రి కూడా దురమవుతాడు. ఇలా బాధలో ఉన్న సిద్దుని మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో అతని తల్లి చేరుస్తుంది. ఈ క్రమంలోనే అదే కాలేజీలో చదువుతున్న అంజలి(రుక్సార్ థిల్లాన్)తో ప్రేమలో పడతాడు సిద్దు. కొన్ని రోజుల తర్వాత సిద్దు, అంజలి మధ్య దూరం పెరుగుతుంది. అసలు అంజలి, సిద్ధు మధ్య దూరం ఎందుకు పెరిగింది ? మ్యాగీ మళ్ళీ వీరి జీవితాల్లోకి ఎందుకు వచ్చింది? జోకర్ (జాన్ విజయ్) సిద్ధు మధ్య వైరం ఏంటి ? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు ఇష్టపడడు ? చివరికి అంజలి, సిద్ధూలని కలిపేందుకు మ్యాగీ ఏం చేస్తుంది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దిల్ రూబా సినిమాకు సరైన కథ ఉన్నా దాన్ని తెరపై ఆసక్తికరంగా, అందరినీ ఆకట్టుకునేలా, తెరకెక్కించడంలో దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు బావుంది కానీ కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదని చెప్పాలి. కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ ప్రేయసి కథలోకి రావడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంది. కిరణ్ అబ్బవరం నటుడుగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అంజలి పాత్రలో రుక్సార్ థిల్లాన్ ఆకట్టుకుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర మేర అలరించింది. జాన్ విజయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. సత్య కామెడీ నవ్వులు పూయించింది. కిల్లి క్రాంతి, తులసి, నరేన్‌లు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సామ్ సి.ఎస్ సంగీతం ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ వర్క్ ను మెచ్చుకోవాలి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
కిరణ్ అబ్బవరం నటన
సంగీతం
ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో కొన్ని సీన్స్
ఆసక్తిరేకెత్తించని కథ, కథనం
రేటింగ్: 2.5/5

