మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ( NTR) టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దేవర పార్టు 1 గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా దాదాపు రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమా జపాన్‌లో విడుదల కానుండడం విశేషం. ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ రిలీజైన బాద్షాతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా జపాన్‌లో మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పటినుంచే ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. ఇందులో భాగంగానే అక్కడి అభిమానులకు కనెక్ట్ అయ్యే విధంగా ‘దేవర’ జపాన్ వెర్షన్ ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక దేవర ప్రమోషన్స్‌లో భాగంగా మార్చి 22న జపాన్‌కి వెళ్లనున్నాడు ఎన్టీఆర్. కాగా, దేవర మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ కు పరిచయమైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటించగా.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా సినిమాను నిర్మించాయి. అనిరుథ్ అందించిన సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

