బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా'(Chava). ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది.
ఇటీవలే బాక్సఫీస్ వద్ద రూ.300 కోట్ల కలెక్షన్లను దాటేసిన ఈ సినిమా తాజాగా రూ.400 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఈ ఏడాది ఈ ఘనతను అందుకున్న తొలి చిత్రంగా ‘ఛావా’ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని బాలీవుడ్ మూవీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ వీకెండ్ ముగిసేనాటికి ‘ఛావా’ రూ.500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కాగా, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ (Geetha Arts) సంస్థ ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని ప్రకటించింది.

