రజనీ ‘కూలీ’ .. రూ. 1000 కోట్లు పక్కా అంటున్న సందీప్ కిషన్

by | Mar 1, 2025 | సినిమా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth), స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌(Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌కు, విడుదలైన గ్లింప్స్‌కు అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో దేవాగా పవర్‌ఫుల్‌ పాత్రలో రజనీకాంత్‌ కనిపిస్తారని, ఆయన పాత్రలో విభిన్న కోణాలుంటాయని, కథలో ఊహించని మలుపులు ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ఇందులో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరగడంతో కూలీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలాఉంటే.. రజినీకాంత్‌ కూలీ మూవీలో యువ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తనపై వస్తున్న వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చారు.
“సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) కూలీ సినిమాలో నేను నటించడం లేదు. నిజానికి నాకు ఆ అవకాశం రాలేదు. ఈ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన మంచి స్నేహితుడు అందుకే ఇటీవల కూలీ మూవీ షూటింగ్ సెట్స్ లోకి వెళ్ళాను. నేను దాదాపుగా 45 నిమిషాల పాటు కూలీ సినిమాను చూశాను. ఈ సినిమా కచ్చితంగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. రజినీకాంత్ గారి కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని సందీప్ కిషన్ పేర్కొన్నారు. కాగా, ఇటీవల కూలీ మూవీ సెట్స్ నుంచి రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ తో సందీప్ కిషన్ ఉన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

కాగా, బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ‘కూలీ’ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా, ప్ర‌స్తుతం ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు కింగ్ నాగార్జున(Nagarjuna), శృతి హాసన్, కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra), సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందులో బుట్టబొమ్మ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.