అధికారం ఉన్నా.. ఆ ఎమ్మెల్యేలకు పట్టు లేదా.. ? కాంగ్రెస్ ఇంటర్నల్ రిపోర్ట్ (Congress Internal Report) లో సంచలనాలు..!
అధికారంలో ఉంటే ఆ కిక్కే వేరు అంటారు. పవర్ చేతిలో ఉంటే పల్లె నుంచి పట్నం దాకా తమ మాటే శాసనం అనుకుంటారు. కానీ, తెలంగాణలో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోందా? పవర్ లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా నియోజకవర్గాల్లో పట్టు దొరకలేదా? అసలు రాష్ట్రంలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలకు ఏమైంది? మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయా? పీటల మీద పెళ్లికి, మున్సిపల్ పోరుకు తేడా తెలియని పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారా.. కాంగ్రెస్ ఇంటర్నల్ రిపోర్ట్‌లోని సంచలన నిజాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సర్పంచ్ దగ్గర్నుంచి సీఎం దాకా.. గెలుపు అనేది చాలా ముఖ్యం. కానీ క్యాబినెట్ మంత్రులుగా ఉండి కూడా, సొంత ఇలాకాలో, సొంత మున్సిపాలిటీల్లో గెలవలేకపోతే దాన్ని ఏమనాలి? కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు ఇదే పాయింట్ మీద ఫైర్ అవుతోంది. ఇంటర్నల్ రిపోర్ట్ తెప్పించుకున్న పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. ముఖ్యంగా రాష్ట్ర మంత్రిగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పరిస్థితి చూడండి. ఆయన నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏమైంది? 22 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకే పరిమితం అయింది. అంటే మెజారిటీ మార్క్ కూడా దాటలేకపోయారు. అధికార పార్టీ మంత్రి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..
మరోవైపు మంత్రి వాకిటి శ్రీహరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సొంత జిల్లా ఆయనది. అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను కాంగ్రెస్ నెగ్గింది కేవలం 3 స్థానాలు మాత్రమే! అంటే పవర్ ఉన్నా సరే, ప్రజల్లో పట్టు సాధించడంలో ఈ మంత్రులు ఫెయిల్ అయ్యారా? అధిష్టానం ఆలోచనలు కూడా అటే వెళ్తున్నాయి. సరే, మంత్రుల బిజీ షెడ్యూల్స్ వల్ల నియోజకవర్గాలను పట్టించుకోలేదు అనుకుందాం. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లాంటి నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడలో సైతం కాంగ్రెస్ మెజారిటీ దక్కించుకోలేదు. ఇది కచ్చితంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. ఇక నారాయణపేట్ విషయానికి వద్దాం. ఇది సామాన్యమైన చోటు కాదు. సీఎం రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కు ఆనుకుని ఉండే ప్రాంతం. అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి ఉన్నారు. అయినా సరే మున్సిపాలిటీని బీజేపీ ఎగరేసుకుపోయింది. అంటే గ్రౌండ్ లెవల్లో కాంగ్రెస్ క్యాడర్ వీక్ అయిందా? లేక నాయకత్వం ప్రజల్ని కనెక్ట్ అవ్వడంలో ఫెయిల్ అయిందా.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి.. వీరెవరికీ మున్సిపల్ పోరులో సరైన ఫలితాలు రాలేదు. ఆమన్ గల్ మున్సిపాలిటీలో అయితే కాంగ్రెస్ ది పూర్ పెర్ఫార్మెన్స్.. కేవలం ఒకే ఒక్క స్థానం! అధికారంలో ఉన్న పార్టీ ఒకే ఒక్క స్థానానికి పడిపోవడం అంటే స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఇదే నిదర్శనమా..
ఇక పార్టీ ఫిరాయించి, హస్తం గూటికి చేరిన నేతల పరిస్థితి ఇంకోలా ఉంది. గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చారు. కానీ మున్సిపల్ పోరులో మ్యాజిక్ ఫిగర్ సాధించలేదు. పాలమూరు జిల్లాలోనే కాదు, ఖానాపూర్ లో వెడ్మ బొజ్జు ఉన్నా.. బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ కే తక్కువ సీట్లు వచ్చాయి. మహబూబాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నా రెండు మున్సిపాలిటీల్లో మెజారిటీ లేదు. పాలకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, తొర్రూరులో బీఆర్ఎస్ కే ఎక్కువ స్థానాలు వచ్చాయి. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఎంపీ కడియం కావ్య తన ఎక్స్-అఫిషియో ఓటు వేసి, ఆ తర్వాత లాటరీ ద్వారా మున్సిపాలిటీని దక్కించుకోవాల్సి వచ్చింది! ఇబ్రహీంపట్నంలో సీనియర్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట 24 వార్డులకు గాను కాంగ్రెస్ గెలిచింది కేవలం 8 స్థానాలు. అంటే కంచుకోటలన్నీ బీటలు వారుతున్నాయా? పార్టీని నమ్ముకున్న క్యాడర్ కి ఏం సమాధానం చెప్తారు.. ఈ ఫలితాలన్నీ చూశాక కాంగ్రెస్ హైకమాండ్ ఊరుకుంటుందా? మున్సిపల్ ఫలితాలపై ఇంటర్నల్ రిపోర్ట్ చూసి పార్టీ పెద్దలు అవాక్కయ్యారట. ‘పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఇంకా నియోజకవర్గాలపై కనీస పట్టు సాధించలేకపోయారా?’ అంటూ సదరు మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.
ఇకనైనా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టండి, క్యాడర్ ను కాపాడుకోండి, గ్రౌండ్ లెవల్లో గ్రిప్ సాధించండి అని గట్టిగానే క్లాస్ పీకారని టాక్. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాల్సిన పార్టీ.. ఇలా మున్సిపల్ స్థాయిలోనే చతికిలబడితే రేపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పంథా మార్చుకుంటారా? లేదా ప్రతిపక్షాలకు మరింత ఛాన్స్ ఇస్తారా? వేచి చూడాల్సిందే.

