మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై కొన్ని రోజులుగా స్పష్టత రావడంలేదు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఈ మూవీని మే 9న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకి శుభవార్త త్వరలోనే రాబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జూలై 24న విశ్వంభర చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూలై 24, 2022లో ఇంద్ర చిత్రం మొత్తం 268 స్క్రీన్లలో విడుదలైంది. అత్యధిక థియేటర్లలో 50 రోజులు, 100 రోజులు పాటు ప్రదర్శితమైంది. అలానే పలు కేంద్రాల్లో 175 రోజులు కూడా ఆడింది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైనా కూడా ఈ సెంటిమెంట్ డేట్ లో విశ్వంభర రాయబోతుండడంపై మెగా అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, సోషియో ఫాంటసీ మూవీ కావడంతో గ్రాఫిక్స్ వర్క్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వర్క్స్ ప్రస్తుతం హాంకాంగ్ లో జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండగా.. అందుకు సంబంధించి ఇంకా చిత్రీకరణ పూర్తవలేదు. దింతో పాటుగా చిరంజీవి ఈ మూవీకి ఇంకా డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇక, సోషియో ఫాంటసీ జానర్లో ‘విశ్వంభర’ సినిమా రూపొందుతుందన్న సంగతి తెలిసిందే. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘అంజి’ తర్వాత మెగాస్టార్ నుంచి ఈ జానర్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

