టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో సీనియర్ హీరో వెంకటేశ్‌కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవికి (Chiranjeevi) కూడా మరో సూపర్ హిట్ అందించేందుకు అనిల్ రావిపూడి సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే ‘మెగా157’ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) గూఢచారి పాత్రలో కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అతిథి పాత్రలో విక్టరీ వెంకటేశ్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రారంభోత్సవం రోజు చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారని టాక్ నడుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఒకవేళ నిజంగానే చిరు – అనిల్ రావిపూడి సినిమాలో వెంకటేష్ (Venkatesh) గెస్ట్ రోల్ చేస్తే అంతకంటే ఆనందించదగ్గ విషయం మెగా అభిమానులకు మరొకటి ఉండదు. గతంలో వెంకటేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి గోపాల గోపాల సినిమాలో నటించగా.. అజ్ఞాతవాసి సినిమాలో వెంకీ మామ గెస్ట్ రోల్ ప్లే చేశాడు. కాగా, సంక్రాంతికి వస్తున్నాం వంటి సాలిడ్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ‘మెగా157’ పై చాలా అంటే చాలా ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో అదిరిపోయే సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేసేలా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీత స్వరాలు అందిస్తున్నారు.

