‘ఛావా’ వసూళ్లు తగ్గినా.. రికార్డుల్లో తగ్గేదేలే!

by | Mar 5, 2025 | సినిమా

బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది.

ఇటీవలే బాక్సఫీస్ వద్ద రూ.400 కోట్ల కలెక్షన్లను దాటేసిన ఈ సినిమా హిందీలో మంచి వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా నాలుగో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మూవీకి దేశవ్యాప్తంగా కలెక్షన్లు ఒక్కసారిగా తగ్గిపోయాయి. ఈ ఆదివారం రూ.24 కోట్లకి పైగా నెట్ కలెక్షన్లు సాధించిన ‘ఛావా’ చిత్రం వర్కింగ్ డే అయిన సోమవారం మాత్రం జోరు కొనసాగించలేకపోయింది. సోమవారం కేవలం రూ. 7.7 కోట్లు నెట్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. దింతో ఇప్పటివరకు ‘ఛావా’ మూవీ మొత్తంగా రూ. 480 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి రూ. 500 కోట్ల మైలురాయిని చేరే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక మరో వైపు ఈ సినిమా ఇటీవలే రూ.400 కోట్ల క్ల‌బ్‌లోకి చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఈ ఘ‌న‌త‌ను అందుకున్న తొలి చిత్రంగా ‘ఛావా’ రికార్డు సాధించింది.

కాగా, ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్‌ సంస్థ మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.