రూ. 500 కోట్ల క్లబ్‌లోకి ‘ఛావా’.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

by | Mar 8, 2025 | సినిమా

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా'(Chava). ఇందులో ర‌ష్మిక మంద‌న్నా (Rashmika) కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్‌ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. విడుదలైన ఫ‌స్ట్ రోజే నుంచే క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రం తాజాగా రూ.500 కోట్ల క్ల‌బ్‌లోకి ఎంట‌ర్ అయ్యింది. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఒక్క హిందీ భాషలోనే 22 రోజుల్లోనే రూ.500 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.502 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. కాగా, ఒక హిస్టారికల్‌ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావడం బాలీవుడ్‌ చరిత్రలో ఇదే తొలిసారి అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, మార్చి 7న ఈ సినిమా తెలుగులో విడుదలవగా.. మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో తొలి రోజు ఏకంగా రూ.3 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ స్థాయిలో​ ఓపెనింగ్స్ రావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. మరోవైపు ‘ఛావా’ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ (Net Flix) భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఏప్రిల్ తొలి వారంలో ఓటీటీలోకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.