హిందీ నటుడు విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమా ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. ఇటీవలే మొదటి వారం థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండో వారంలో కూడా జోరు చూపిస్తోంది. తాజాగా రూ. 300 కోట్ల మైలురాయిని దాటేసిన ఈ సినిమా వీకెండ్ ముగిసినప్పటికీ 11వ రోజైన సోమవారం కూడా అంతే దూకుడుగా వసూళ్లు సాధించింది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ. 19 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకూ ఈ మూవీ రూ. 353 కోట్లకి పైగా కలెక్షన్లు రాబట్టింది. వరుసగా శివరాత్రితో పాటుగా వీకెండ్ హాలిడేస్ వస్తుండడంతో ఈ మూవీ త్వరలోనే రూ. 400 కోట్ల మైలురాయిని అందుకునే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

