‘ఛావా’ తెలుగు ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌

by | Mar 8, 2025 | సినిమా

బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandana) కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ (Vicky Kaushal) ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక మందన్నా పోషించారు. కాగా, శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ (Chava) ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖన్నా నటించగా.. మ్యూజిక్ మాస్ట్రో ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ ను గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) సంస్థ మార్చి 7న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసింది. అయితే తెలుగులోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. దాంతో ఈ చిత్రం తొలి రోజు బాక్సఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు వసూలు చేసింది. మొదటి రోజు ‘ఛావా’కు రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తంగా రూ. 3.03 కోట్లు వసూళ్లు వచ్చినట్లు సమాచారం. దాదాపు మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైన డబ్బింగ్‌ సినిమాకు తొలి రోజు ఈ స్థాయి వసూళ్లు రావడం రికార్డు అని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ఛావా’ జోరు చూస్తుంటే వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 483.58 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం.