బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ దీంట్లో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. కాగా శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మొఘల్ రాకుమారి పాత్రలో డయానా పింటీ, ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించగా.. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది.
ప్రస్తుతం ఫస్ట్ వీక్ థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో వారంలోకి ప్రవేశించింది. అంతా అనుకున్నట్లుగానే మొదటి వారం రోజుల్లో ‘ఛావా’ మూవీ
రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సత్తా చాటింది. మొదటి వారం ముగిసేసరికి ఈ సినిమా బాక్సఫీస్ వద్ద మొత్తంగా రూ.310 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో మన దేశంలో రూ.225 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. ఓవర్సీస్ లో రూ.85 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ వీకెండ్ ముగిసేనాటికి ‘ఛావా’ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించనుందని.. మరికొన్ని రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

