ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా ఈ రోజు భారత, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
229 పరుగుల విజయ లక్ష్యం తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ లు మొదటి వికెట్ కు 69 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ 36 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన కోహ్లీ 22 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు, అక్షర్ పటేల్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఒక వైపు వికెట్లు పడుతున్న శుభమన్ గిల్ నిలకడగా ఆడుతూ ఛేదించాల్సిన స్కోర్ ను మెల్ల, మెల్లగా కరిగించాడు. అతనికి రాహుల్ చక్కని సహకారం అందించాడు
చివర వరకు క్రీజ్ లో నిలబడిన, శుభమన్ గిల్, రాహుల్ లు ఐదవ వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వన్ డే ల్లో శుభమన్ గిల్ తన ఎనిమిదవ సెంచరీ ని చేశాడు. శుభమన్ గిల్ 101 పరుగులతో, కే ఎల్ రాహుల్ 41 పరుగులతో అజేయంగా నిలిచారు
అయితే 35 పరుగుల కె 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ పోరాడి 228 పరుగులు చేయడం నిజంగా అభినందించదగ్గ విషయం. భారత జట్టుకు టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పవచ్చు. మన వాళ్ళు అంత సునాయాసంగా అయితే గెలవలేదు. 229 పరుగులను ఛేదించడానికి మన వాళ్ళు 46.3 ఓవర్ లు ఆడాల్సి వచ్చింది
బంగ్లాదేశ్ బౌలర్ల లో రిషబ్ హుస్సేన్ రెండు వికెట్లు తీయగా, తస్మిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహ్మాన్ చెరో ఒక వికెట్ తీశారు.
అంతకు ముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ రెండు పరుగులకే రెండు వికెట్ లు కోల్పోయింది. కీలక బంగ్లా ఆటగాళ్లు కెప్టెన్ శాంతో, సౌమ్య సర్కార్ లు డక్ అవుట్ అయ్యారు.
తాంజిద్ హాసన్ కొంత ప్రతిఘటించినా 25 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మెహదీ హాసన్ మిరాజ్ 5 పరుగులు, సీనియర్ బ్యాట్స్ మన్ ముషఫికర్ రెహ్మాన్ డక్ అవుట్ అవడంతో 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది
అయితే ఆ తరవాత వచ్చిన జేకర్ అలీ, తౌహిర్ హ్రిదయ్ ఆరవ వికెట్ కు 154 పరుగులు జోడించారు. 68 పరుగులు చేసిన జేకర్ అలీ, షమీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
అయితే తౌహిర్ హ్రిదయ్ మాత్రం, పోరాట పటిమను ప్రదర్శించి 118 బంతుల్లో సరిగా 100 పరుగులు చేసి ఆఖరి బ్యాట్స్ మన్ గా హర్షిత్ రానా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆఖరులో తౌహిర్ హ్రిదయ్ కాలి కండరాలు పట్టేసి చాలా ఇబ్బందిపడ్డాడు
అక్షర్ పటేల్ తాంజిద్ హాసన్, ముషఫికర్ రెహ్మాన్ లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ తీసే అవకాశం వచ్చింది. అయితే బంగ్లా బాట్స్ మన్ జేకర్ ఇచ్చిన క్యాచ్ ను, కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్ వదిలేయడంతో ఆ అవకాశం తప్పిపోయింది. రోహిత్ శర్మ కూడా చేతితో గ్రౌండ్ ని కొడుతూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అక్షర్ పటేల్ కు అపాలజీ చెప్పిన రోహిత్ శర్మ
భారత బౌలర్ల లో షమీ 5 వికెట్ లు తీయగా, హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు


