ఐకాన్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్‌తో పాటు బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైన 75 రోజుల్లో పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1871 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గతేడాది బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ నిలిచింది. అయితే తాజాగా అల్లు అర్జున్ మరో అరుదైన ఘనత సాధించారు.
వరల్డ్ వైడ్ పాపులర్ మూవీ మ్యాగజైన్ అయిన ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ఇప్పుడు ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ పేరుతో మన దేశంలోనూ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలోనే ఈ మ్యాగజైన్ తొలి సంచిక కవర్ పేజీపై అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన ఫొటో షూట్ నిర్వహించారు. ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ ప్రోమో వీడియోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. భారత సినీ చరిత్రలో నటుడిగా నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. కష్టపడే తత్వమే నన్ను నటుడిగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే భావన నాలో ఎప్పుడూ ఉంటుంది. నేను ఒక సామాన్య నటుడనే ఆలోచనతోనే సినిమాలో నటిస్తాను. నా విరామ సమయంలో ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడమే నాకిష్టం అని అల్లు అర్జున్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

