‘AA23’.. బిగ్​ స్టేట్​మెంట్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

by | Jan 24, 2026 | సినిమా

‘పుష్ప’, ‘పుష్ప 2’ (Pushpa) చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్‌గా ఎదిగాడు యంగ్ హీరో అల్లు అర్జున్‌. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత మరో కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanakaraj) దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ని కూడా మేకర్స్ సంక్రాంతి కానుక‌గా ప్రకటించారు. మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు. అయితే ‘AA23’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ కనగరాజ్‌ను మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలా తీయాలి అనుకుంటున్నారు అని అడగ్గా.. వెంటనే ఆయన నా తర్వాతి సినిమా ‘AA23’నే నా డ్రీమ్ ప్రాజెక్ట్. నేను అనుకున్నట్లుగా ఈ సినిమా తీస్తే చాలు అది నా జీవితానికి సరిపోద్ది. ఈ సినిమాతో అభిమానులకు ఓ అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తాను అనే నమ్మకం నాకుంది అని లోకేశ్ పేర్కొన్నారు. ఇక డైరెక్టర్ లోకేశ్ చేసిన కామెంట్స్ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. గతంలో ఖైదీ, విక్రమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన లోకేశ్ ఈసారి బన్నీని ఎలా చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ప్రాజెక్టు సూపర్ హీరో మూవీలా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఇందులో హీరోకు ఓ చేయి ఐరన్ హ్యాండ్ లా ఉంటుందని సమాచారం. కాగా, ఈ సినిమా కోసం లోకేశ్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.