టాలీవుడ్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకుల్లో అక్కినేని అఖిల్ ఒకరు. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్ తదుపరి సినిమా మీదే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
మరో వారం రోజుల్లో అక్కినేని వారసుడి పుట్టినరోజు రానుంది. ఏప్రిల్ 8న అక్కినేని అఖిల్ తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు. ఈ సందర్భంగా ‘లెనిన్’ అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ (Akhil) పుట్టినరోజు కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం అఖిల్ ఒక సరికొత్త మేకోవర్ ని రెడీ చేసినట్లు తెలుస్తుండగా.. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అధికభాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్ చేస్తారట. భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని చిత్ర బృందం భావిస్తుంది.

