భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నిర్ణయాత్మక ఐదవ టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. వెలుతురు లేమి కారణంగా ఆట నిలిపివేసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ గెలవడానికి 35 పరుగులు కావాలి. భారత జట్టు గెలవడానికి నాలుగు వికెట్లు కావాలి. ఇంగ్లాండ్ మ్యాచ్ గెలిచి సిరీస్ చేజిక్కించుకుంటుందో, మ్యాచ్ గెలిచి భారత జట్టు సిరీస్ ను సమం చేస్తుందో తెలియాలంటే కొంత నిరీక్షణ తప్పదు. ఇప్పటికి గెలుపు అవకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి
అంతకు ముందు, 374 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు, మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 50 పరుగులు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు క్రాలి, డకెట్ లు మొదటి వికెట్ కు 50 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. 14 పరుగులు చేసిన క్రాలి సిరాజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.
నాలుగవ రోజు, 54 పరుగులు చేసిన డకెట్, ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 82 పరుగుల వద్ద ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ పోప్ 27 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. మొదటి ఇన్నింగ్స్ లో కూడా ఇలాగే సిరాజ్ బౌలింగ్ లో పోప్ అవుట్ అయ్యాడు
బ్రూక్ , రూట్ సెంచరీలు
అయితే 106 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ జట్టు ను బ్రూక్, మిస్టర్ డిపెండబుల్ రూట్ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగవ వికెట్ కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లాండ్ ను పటిష్ట స్థితిలోకి తీసుకు వచ్చారు.
బ్రూక్ ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా సాగింది. బ్రూక్ 98 బంతుల్లో 111 పరుగులు చేసి ఆకాష్ దీప్ బౌలింగ్ సిరాజ్ చేతికి చిక్కాడు. అయితే మరో వైపు రూట్ గోడలా నిలబడిపోయాడు. టీ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది.
టీ విరామం అనంతరం, 5 పరుగుల వద్ద బెథెల్ ను ప్రసిద్ కృష్ణ బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోర్ 332 పరుగులు. అయితే, ఆ తరవాత, కొద్ది సేపటికి 105 పరుగులు చేసి కొరకరాని కొయ్యగా తయారయిన రూట్ ను ప్రసిద్ కృష్ణ అవుట్ చేయడంతో, భారత జట్టులో కొత్త ఉత్సాహం వచ్చింది. మళ్ళీ గెలుపు రేసులోకి వచ్చారు.
అంతకు ముందు, ఇండియా రెండవ టెస్ట్ ను 336 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించగా, నాలుగవ టెస్ట్ మ్యాచ్ ను రాహుల్, గిల్, సుందర్, జడేజా ల అసమాన పోరాటం తో ఓడిపోవాల్సిన మ్యాచ్ ని డ్రా చేసి గట్టెంకించారు
ఈ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ 754 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 20 వికెట్ల తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సిరాజ్ మొదటి స్థానంలో నిలిచాడు. అయితే, సిరీస్ ఆసాంతం రూట్ వికెట్ ను తీయడంలో భారత బౌలర్లు ఆపసోపాలు పడ్డారు

