టాలీవుడ్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటించారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందించారు. ఇందులో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మొదటి షో నుంచే ఈ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్స్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ గత చిత్రం ‘టిల్లు స్క్వేర్’కి (Tilu Square) మొదటి రోజు రూ.23 కోట్ల వరకు కలెక్షన్స్ రాగా.. ‘జాక్’ చిత్రానికి తొలి రోజు ఇండియాలో కేవలం రూ. 2.5 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక రెండో రోజు జాక్ మూవీ ఇండియాలో రూ. 1.01 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అయితే రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ కావడంతో పాటు ఆక్యుపెన్సీ కూడా తగ్గిందట.
ఇక మూడో రోజు శనివారం వీకెండ్ కావడంతో దాదాపుగా రూ. 85 లక్షల నెట్ వసూళ్లు (ఏర్లీ ఎస్టిమేట్స్) సాధించినట్లు తెలుస్తోంది. మొత్తంగా మొదటి మూడు రోజుల్లో ఇండియాలో జాక్ మూవీ రూ. 4.36 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 2200 స్క్రీన్లలో జాక్ (Jack) మూవీ విడుదలవగా.. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవడానికి ఏమాత్రం సరిపోవు అనే చెప్పాలి. ఇక నాలుగో రోజు సెలవు దినం కావడంతో కలెక్షన్స్ లో జోరు చూపిస్తుందా అనేది చూడాలి. అయితే టిల్లు స్క్వేర్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేసిన సినిమాకి ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో సిద్దు ఫ్యాన్స్ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, విడుదలకు ముందు ‘జాక్’ చిత్రానికి రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగ్గా.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం జాక్ సినిమాకు మిక్స్డ్ టాక్ ఉండడంతో వీకెండ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ ను బట్టి సినిమా రేంజ్ డిసైడ్ అవుతుంది అని చెప్పొచ్చు.

