మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా త్రిష (Trisha) కథానాయికగా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయధరమ్ తేజ్‌తో పాటు నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారికా ఈ చిత్రంలో నటించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్, అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఏప్రిల్ 12న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా మే 9న విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించినప్పటికీ మరోసారి వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కు త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి (Chiranjeevi) కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా విడుదల తేదీ అయిన జూలై 24న విశ్వంభర సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా జూలై 24న ‘విశ్వంభర’ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. నిజానికి ‘విశ్వంభర’ను మే 9న విడుదల చేస్తారనే అనుకున్నారు. ఆ తేదీన విడుదలైన చిరంజీవి సినిమాలు ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే ఇటీవల మే 9న పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దాంతో తనకు కలిసివచ్చిన తేదీని తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఇచ్చేసి ‘విశ్వంభర’ను (Viswambhara) చిరు పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 24న విశ్వంభర విడుదల కానుండగా.. 2022 అదే తేదీన విడుదలైన ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మొత్తం 268 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం.. అప్పటి వరకూ ఉన్న చిరంజీవి సినిమాల రికార్డులను బద్దలు కొడుతూ ఈ సినిమా ఏకంగా 122 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. అలాగే పలు కేంద్రాల్లో 175 రోజులు కూడా ఆడింది. ఈ నేపథ్యంలోనే మరోసారి సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ.. జూలై 24న చిరు విశ్వంభరను విడుదల చేస్తుండడంతో ఈసారి కూడా ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

