పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవర్ స్టార్ అభిమానులను అలరించనున్నారు. నిజానికి ఈ సినిమా మార్చి నెల 28నే విడుదల కావాలి. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం వల్ల రిలీజ్ డేట్‌ని మే 9కి వాయిదా వేశారు. కానీ ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే 9న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) విడుదలవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా చివరి షెడ్యూల్ ఇటీవలే ఖమ్మంలో ప్రారంభమైంది. ఈ సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్ ఇంకా ఐదు రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) ఈ సినిమా కోసం ఏప్రిల్ నాలుగో వారం వరకూ వరుసగా కాల్షీట్స్ ఇచ్చినట్లు సమాచారం. దింతో ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ పై మిగిలిన చిత్రీకరణ జరపనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ వారం నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా దూకుడుగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల చివరి నాటికి చిత్రీకరణతో పాటుగా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే 9న సినిమాను కచ్చితంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, భారీ అంచనాల నడుమ వస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘హరి హర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

