సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ’కూలీ’. సన్‌పిక్చర్స్ (Sun Pictures) nబ్యానర్‌పై కళానిధిమారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ (Rajanikanth) తో పాటు నాగార్జున (Nagarjuna), శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ షాహిర్ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ (Ameer Khan) ప్రత్యేక పాత్రలో నటిస్తుండగా.. బుట్ట బొమ్మ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. రజనీకాంత్ కెరీర్లో ఇది 171వ చిత్రం కావడం విశేషం. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి సినిమాల తర్వాత లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) రూపొందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుండగా.. ఇప్పటికే విడుదలైన కొన్ని మూవీ పోస్టర్లు, అలాగే టైటిల్ టీజర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ అందించారు.
ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కూలీ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ.40 కోట్లకు జరిగినట్లు తెలుస్తోంది. దింతో టాలీవుడ్ లో కూలీ (Coolie) సరికొత్త రికార్డు సాదించినట్లయింది. ఇప్పటి వరకూ తమిళ డబ్బింగ్ చిత్రాలకు ఈ రేంజులో బిజినెస్ జరగలేదు. అంతకుముందు తెలుగులో సూర్య నటించిన ‘కంగువ’ మూవీ రైట్స్ రూ.25 కోట్లకు అమ్ముడవగా.. విజయ్ ‘లియో’ రైట్స్ రూ.20 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే రజినీకాంత్ గత చిత్రం ‘జైలర్’ సినిమా హక్కులు రూ.17 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు ఊహించని రేంజులో కూలీ చిత్రానికి తెలుగులో రూ.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఇక ఇప్పటికే కూలీ మూవీ డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ (Amazon) ప్రైమ్ వీడియోస్ కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడినప్పటికీ ప్రైమ్ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

